AkkadaAmmayiIkkadaAbbayi : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

Viswa
4 Min Read
Pradeep Machiraju Akkada Ammayi ikkada abbayi Movie review

సినిమా: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి (AkkadaAmmayiIkkadaAbbayiReview)

ప్రధాన తారాగణం: ప్రదీప్‌మాచిరాజు, దీపికా పిల్లి, సత్య, గెటప్‌ శీను, రోహిణీ, ఝాన్సీ, జాన్‌ విజయ్‌
దర్శకత్వం: నితిన్‌–భరత్‌
నిర్మాణం: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌
ఎడిటర్‌: కోదాటి పవన్‌కళ్యాణ్‌
సంగీతం: రధన్‌
కెమెరా: ఎమ్‌ఎన్‌ బాలరెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 11, 2025

కథ

ఆంధ్రప్రదేశ్‌–తమిళనాడు సరిహద్దు చివర్లో ఉండే గ్రామం బైర్లంక. ఈ గ్రామంలో వరసుగా మగపిల్లలే జన్మిస్తారు. అదే సమయంలో ఆ గ్రామంలో కరువు కూడా తాండవిస్తుంటుంది. కనీసం ఒక్క ఆడపిల్లైన ఈ గ్రామంలో జన్మించకపోవడం వల్లే, ఊరికి అరిష్టం వచ్చిందని ఈ ఊరి ప్రజలు భావిస్తుంటారు. అయితే అరవైమంది మగపిల్లలు జన్మించిన తర్వాత ఒకే ఒక్క ఆడపిల్ల ఆ గ్రామంలో జన్మిస్తుంది. ఈ అమ్మాయికి రాజాకుమారి అని పేరు పెడతారు. ఊర్లో వర్షం పడి, అంతా సంతోషంగా ఉంటారు. దీంతో ఆ ఊరి పెద్ద, ప్రెసిడెంట్‌ చిన్నప్ప ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఊర్లో ఉన్న 60మందిలో ఎవరో ఒకర్నీ, రాజకుమారి పెళ్లి చేస్తుంటే, అతనే ఊరి ప్రెసిడెంట్‌ అవుతాడని,తన ఆస్తి మొత్తాన్ని రాజకుమారి భర్తకే ఇస్తానని చిన్నప్ప చెబుతాడు. ఇందుకు రాజకుమారి తండ్రి ఒప్పుకుంటాడు.

ఇక కొంతకాలం గడిచిన తర్వాత బైర్లంక గ్రామానికి మరుగుదొడ్డు నిర్మించే ప్రాజెక్ట్‌ పనిపై వస్తాడు కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు), బిలాల్‌ (హాస్యనటుడు సత్య). రాజకుమారి (దీపిక)తో ప్రేమలో పడతాడు. కృష్ణ– రాజకుమారిలు ప్రేమించుకుంటారు. కానీ ఊరిబయట వ్యక్తిని రాజకుమారి ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని,ఆ ఊరి ప్రెసిడెంట్, ఆ ఊర్లో ఉన్న 60మంది వ్యక్తులు ఒప్పుకోరు. కానీ దీపిక తల్లి (ఝాన్సీ) వాదనతో ఊరి జనం కృష్ణ–రాజ కుమారిల ప్రేమను అంగీకరిస్తారు. కానీ ఊరి ప్రెసిడెంట్‌ చిన్నప్ప కృష్ణకు ఓ కండీషన్‌ పెడతాడు. రాజకుమారి కోసం ఇంతకాలం ఎదురుచూసిన 60మందికి పెళ్లిళ్లు చేయమని కృష్ణతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేయసి కోసం కృష్ణ 60మందికి వివాహాలు చేశాడా?
రాజకుమారిని కృష్ణ ప్రేమించడం వల్ల అతని కుటుంబంలో వచ్చిన సమస్యలు ఏమిటి? అన్నది మిగిలిన కథాంశం.

విశ్లేషణ

ప్రేమించిన అమ్మాయి కోసం 60మంది అబ్బాయిలకు హీరో పెళ్లిళ్లు చేయాల్సి రావడం అనే పాయింట్‌ బాగుంది. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఈ సినిమాలోని కామెడీ స్టారై్టపోతుంది. ప్రతి పదినిమిషాలకో కామెడీ స్కిట్‌ వస్తూ ఆడియన్స్‌ను హిలేరియస్‌గా నవ్విస్తుంటుంది. తొలిభాగంలో వచ్చే డ్రైవింగ్‌ సీన్, స్కూల్‌లో సీరియల్స్‌ సాంగ్స్, బాత్‌రూమ్‌ కట్టడాల సీన్, ముఖ్యంగా ఫణి (గెటప్‌ శీను)– బిలాల్‌ (సత్య)–కృష్ణ (ప్రదీప్‌మాచిరాజు)ల సన్నివేశాలు ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. లాజిక్‌లు గట్రా వెతకవద్దు.సీక్రెట్‌గా ఉన్న కృష్ణ–రాజకుమారిల లవ్‌ ఊరి జనానికి తెలిసిపోవడంతో ఇంట్రవెల్‌ పడుతుంది. హీరోఈ అరవైమందికి పెళ్లిళ్లు చేసేందుకు వారిని హైదరాబాద్‌కు తీసుకురావడం, అక్కడ వారికి పెళ్లిళ్లు చేసే ప్రయత్నాలతో ప్రీ క్లైమాక్స్‌ వరకు కథ సాగుతుంది. ఓ ఫైర్‌ యాక్సిడెంట్‌తో కథ క్లైమాక్స్‌కు చేరుతుంది. సినిమా పూర్తవుతుంది.

తొలిభాగంలో ఉన్నంత కామెడీ సెకండాఫ్‌లో మిస్‌ అయ్యింది. సెకండాఫ్‌లో వచ్చే బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ పాత్రలు ఫోర్డ్స్‌గా ఉంటాయి. తొలిభాగంలో బలంగా కనిపించిన హీరోయిన్‌ రోల్‌ సెకండాఫ్‌లో సడన్‌గా డౌన్‌ అయిపోతుంది. హీరో–హీరోయిన్లను సెకండాఫ్‌లో వచ్చే గెస్ట్‌ రోల్స్‌ డామినేట్‌ చేయడంతో, కథ దారితప్పినట్లవుతుంది. క్లైమాక్స్‌ కూడా పెద్ద కన్విన్సింగ్‌గా ఉండదు. ఎమోషనల్‌ డోస్‌ సరిపోలేదు. కానీ ఒవరాల్‌గా మూవీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే..!

ప్రదీప్‌మాచిరాజు తన రెండో సినిమాలోనే స్క్రీన్‌పై మంచి యాక్టింగ్‌ చేశాడు. కామెడీ టైమింగ్‌ బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌లో కాస్త పరిణీతి చెందాల్సిన అవసరం ఉంది. హీరోయిన్‌ రాజకుమారిగా దీపిక మంచి నటన కనబరిచింది. తొలిభాగంలో తనదే హవా. ట్రెడిషన్‌గానూ, ట్రెండీగానూ (పాటల్లో) కనిపించింది.ఆ తర్వాత ఫణిగా గెటప్‌ శీను, బిలాల్‌గా సత్యలు…ఈ సినిమాకు మేజర్‌ పిల్లర్స్‌. వీళ్ల కామెడీ సూపర్భ్‌గావర్కౌట్‌ అయ్యింది. సెకండాఫ్‌లో పాన్‌ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ, పెళ్లికొడుకు సుబ్రతారాయ్‌గా వెన్నెల కిశోర్, సుబ్రతారాయ్‌ బావ అంటే…వెన్నెల కిశోర్‌ బావగా బ్రహ్మానందం వారి వారి పాత్రల మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. వీరిందరితో పాటుగా మురళీధర్, సెల్వ (కోదాటి పవన్‌కల్యాణ్‌)
, తమిళ నటుడు రాజేంద్రన్‌ వారి పాత్రల పరిధిమేరకు నటించారు.హీరోయిన్‌ తల్లిగా ఝాన్సీ, హీరో తల్లిగా రోహిణీ కథకు కీలకమైన పాత్రల్లో యాక్ట్‌ చేశారు.

దర్శక–ద్వయం నితిన్‌–భరత్‌ల టేకింగ్‌ బాగానే ఉంది. స్టోరీలో కొన్ని లాజిక్స్‌ మిస్‌ అయినా..ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో మాత్రం సక్సెస్‌ అయ్యారు. హీరో–హీరోయిన్లు ఒకరినొకరు దాదాపు 30 నిమిషాలవరకు చూసుకోరు. కానీ అప్పిటి వరకు ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయడంలో వీరిద్దరూ పాస్‌ అయ్యారు. నిర్మాణ విలువలు, మ్యూజిక్‌ ఫర్వాలేదు. కెమెరా ఒకే. ఎడిటింగ్‌ సెకండాఫ్‌లో ఇంకొంచెం చేయవచ్చు.

బాటమ్‌లైన్‌: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి…నవ్విస్తారు.
2.5/5

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *