Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను గత కొన్ని గంటలుగా కలవరపెడుతున్న వార్తలపై ఆయన బృందం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ గాయపడ్డారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో ప్రభాస్‌కు పెద్ద ప్రమాదం జరిగిందంటూ ఊహాగానాలు రావడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.
దీనిపై స్పందించిన ప్రభాస్ టీమ్.. ప్రభాస్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఈరోజు కూడా యధావిధిగా షూటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. సాధారణంగా షూటింగ్ సెట్స్‌లో జరిగే చిన్నపాటి సంఘటనలే తప్ప, ఎటువంటి ప్రమాదం జరగలేదని.. ఆయన చేతికి కేవలం చిన్న గీత మాత్రమే పడిందని స్పష్టం చేశారు. దానికి చికిత్స అవసరం లేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ అందించిన హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి మరియు భానుచందర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ విజువల్ ఎపిక్ 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ సేఫ్ అని తెలియడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.