Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలు కాకుండా, ఆయనను కలవడానికి పాటించాల్సిన ‘నిబంధనలు’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అల్లు అర్జున్‌ను మీట్ అవ్వాలంటే ఏకంగా 42 కఠినమైన రూల్స్ ఉంటాయంటూ ఓ పాడ్‌కాస్ట్ వేదికగా వెలువడిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.
సాధారణంగా స్టార్ హీరోల చుట్టూ భారీ భద్రత, ప్రోటోకాల్స్ ఉండటం సహజమే. కానీ, అల్లు అర్జున్ విషయంలో అవి కాస్త ‘అతి’గా ఉన్నాయని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘వుమెన్ ఇన్ మీడియా సేల్స్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, గతంలో బన్నీని కలిసినప్పటి తన అనుభవాలను పంచుకున్నారు. కావేరి బారువా మాటల ప్రకారం.. అల్లు అర్జున్‌తో సమావేశానికి ముందు ఆయన బృందం ఒక నోట్ పంపించారట. అందులో ఉన్న కొన్ని వింత నిబంధనలు ఇవే. హీరో కళ్లలోకి నేరుగా చూడకూడదు. ఆయనకు కరచాలనం చేయకూడదు. ఇంటర్వ్యూ లేదా మీటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు అనుమతించరు. దక్షిణాది స్టార్ల చుట్టూ ఒక పెద్ద సైన్యం ఉంటుందని, బన్నీ విషయంలో అయితే “మేనేజర్‌కు.. మేనేజర్‌కు.. మేనేజర్” అన్నట్లుగా ఒక సుదీర్ఘమైన నెట్‌వర్క్ ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మరియు అభిమానుల మధ్య యుద్ధం మొదలైంది. “జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కళ్లలోకి చూసే మాట్లాడతారు కదా? ఇది పచ్చి అబద్ధం” అని కొందరు బన్నీ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఆయన ఎంతో సింపుల్ అని, అందరితో సరదాగా ఉంటారని సమర్థిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల భద్రత మరియు ప్రైవసీ దృష్ట్యా ఇలాంటి ప్రోటోకాల్స్ ఉండటంలో తప్పు లేదని మరికొందరు వాదిస్తున్నారు. “కళ్లలోకి చూస్తే ఏమవుతుంది? మరీ ఇంత రూల్స్ ఏంటి?” అని సామాన్య నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై లేటెస్ట్ గా అల్లు అర్జున్ టీం నుంచి అధికారిక క్లారిటీ బయటకి వచ్చింది. ఒక అధికారిక ప్రెస్ నోట్ ని విడుదల చేసి అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. అంతే కాకుండా అల్లు అర్జున అందరితో ఎంతో మర్యాదపూర్వకంగానే ఉంటారని ఇందులో తెలిపారు. ఇక దీనితో పాటుగా తనపై ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.