ఆమితాబ్ బచ్చన్ ‘డాన్’ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు చంద్ర బారోట్ (Don Director Chandra Barot) చని పోయారు. 1978లో విడుదలైన ‘డాన్ (Don)‘ మూవీ ఆధారంగా రజనీకాంత్, ప్రభాస్, షారుక్‌ఖాన్‌లు వంటి వారు ‘డాన్’ కథలతో సినిమాలు చేయడానికి ‘డాన్’ సినిమాయే స్ఫూర్తి. ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే…ఈ ‘డాన్’ మూవీ చంద్ర బారోట్‌కి తొలి సినిమా. ఇంకో విశేషం ఏంటంటే.. అసలు..డాన్ సినిమాను ఓ పక్కా ప్రణాళికతో తీయలేదట.
ఏం జరిగిందంటే…బాలీవుడ్ ప్రముఖ నటుడు- దర్శక-నిర్మాత మనోజ్ కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చంద్ర బారోట్. ‘రోటీ కపడా ఔర్ కమాన్’ సినిమా సమయంలో చంద్ర బారోట్‌కి, అమితాబ్‌బచ్చన్‌కి సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ ఈ సినిమా సినిమాటోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత- నిర్మాత నారిమన్ ఇరానీ ఓ సినిమా తీసి, తీవ్ర నష్టాల్లో కురుకపోయాడట. ఆయన్ను ఎలాగైనా ఆ కష్టాల నుంచి బయట పడేయాలని..అప్పటివరకు మనోజ్ కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన, చంద్ర బారోట్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు.

ప్రముఖ రచయితలు సలీమ్-జావేద్‌లు పక్కన పెట్టిన ఓ డాన్ స్క్రిప్ట్‌ని దుమ్ము దులిపి, అమితాబ్‌బచ్చన్‌కు వినిపించి, ఒకే చేయించి, సెట్స్ మీదుకు సినిమా తీసుకుని వెళ్లారు. 1978 మే 15…మంచి వేసవి సమయంలో విడుదలైన ఈ తొలి డాన్ మూవీ సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కోటిరూపాయల లోపు బడ్జెట్‌తోనే నిర్మించబడిన ఈ సినిమా, అప్పట్లోనే ఏడు కోట్ల రూపాయలను రాబట్టి, సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అమితాబ్‌బచ్చన్‌ను సూపర్‌స్టార్ చేసింది. కానీ ఏ లక్ష్యంతో అయితే డాన్ సినిమాను స్టార్ట్ చేశారో, ఆ లక్ష్యం నెరవేరలేదు… ఎందుకంటే..డాన్ నిర్మాత, ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ ప్రమాదంలో కన్నుమూశారు. సోమవారం ఉదయం ‘డాన్’ దర్శకుడు చంద్ర బారోట్ కూడా తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చనిపోయారు. చంద్ర బరోట్ మరణం పట్ల అమితాబ్‌బచ్చన్, ఫర్హాన్ అక్తర్..వంటి బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు.
మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటేంటే…వెండితెర డాన్‌ను క్రియేట్ చేసిన చంద్ర బారోట్ భారతీయుడు కాదు. ఆయన టాంజానియాలో జన్మించాడు. ఓ బ్యాంకులో ఉద్యోగి. ఆర్ధిక మాధ్యం, జాతివివక్ష…వంటి కారణాల చేత ఆయన ఇండియాకు వలస వచ్చారు. బాలీవుడ్‌లో తమ బంధువుల్లో ఒకరి రికమెండనేషన్‌తో మనోజ్‌కుమార్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. ‘డాన్’ సినిమాతో హిట్ కొట్టిన చంద్ర బారోట్ ఆ తర్వాత హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు తీసిన, అవి హిట్ కాలేదు. కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా…డాన్ సక్సెస్‌ను ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు.