Hero Dhanush in director Shankar’s dream project: ప్రముఖ దర్శకుడు శంకర్ తన గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో వచ్చిన విమర్శలకు తన మార్క్ విజువల్ వండర్‌తో సమాధానం చెప్పాలని ఆయన నిశ్చయించుకున్నారు. తమిళ నవల ‘వీర యుగ నాయగన్ వేల్పారి’ ఆధారంగా రూపొందనున్న ఈ చారిత్రక గాథకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ భారీ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం శంకర్ కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రణవీర్ సింగ్, చియాన్ విక్రమ్ వంటి దిగ్గజ నటులు భాగం కానున్నారని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ధనుష్ పేరు కూడా తోడవడంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ధనుష్ ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్, తన 55వ సినిమా (D55)తో పాటు హాలీవుడ్ ప్రాజెక్టులతో 2027 వరకు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. శంకర్ వంటి లెజెండరీ దర్శకుడితో పని చేసే అవకాశం ఉన్నప్పటికీ, తన కాల్‌షీట్స్ సర్దుబాటు చేయడం ఇప్పుడు ధనుష్‌కు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల ధనుష్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి శంకర్ హాజరుకావడం చూస్తుంటే, వీరిద్దరి మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయని, ధనుష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో మూడు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద మల్టీస్టారర్ మూవీగా నిలిచేలా భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయం. శంకర్ తన పాత వైభవాన్ని ఈ ‘వేల్పారి’తో మళ్ళీ అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.