‘పుష్ప ది రూల్’ సినిమాలోని స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హీరోయిన్ శ్రీలీల (Heroine Sreeleela)కు అవకాశాలు పెరిగాయి. దీంతో ప్రజెంట్ హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా, తమిళంలో శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల. తెలుగులో రవితేజ ‘మాస్ జాతర’, పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, అఖిల్ ‘లెనిన్’ సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి.
మాస్ జాతర షూటింగ్ పూర్తయింది. కానీ కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల (Sreeleela) చేసే హిందీ సినిమా, పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ సినిమాల చిత్రీకరణలు పూర్తి కాలేదు. ఈ సినిమాలన్నీ సెట్స్‌పై ఉన్నాయి. పైగా బాలీవుడ్‌లో కొత్త ఆఫర్లు వస్తున్నాయట శ్రీలీలకు. దీంతో ఇన్ని సినిమాలకు డేట్స్ కేటాయించలేక, లెనిన్ సినిమా నుంచి తప్పుకోవాలని శ్రీలీల భావిస్తున్నారట. అయితే శ్రీలీల కాంబినేషన్‌తో కొన్ని సీన్స్ చిత్రీకరణ అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా మేజర్ చిత్రీకరణ జరగలేదు. ఇటీవల అఖిల్ పెళ్లి పనుల వల్ల లెనిన్ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారట. మురళి ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాగవంశీ, నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమాను మొదట్లో ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా, ఇది సాధ్యమైయ్యేలా కనిపించడం లేదు.
ఇక రీసెంట్ టైమ్స్‌లో శ్రీలీల ఓ సినిమా నుంచి తప్పుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనగనగా ఒక రాజు సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నారు. నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల ప్లేస్‌ను మీనాక్షీ చౌదరి చేస్తోంది. అలాగే నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు వర్మ డైరెక్షన్‌లోని సినిమాకూ మొదట హీరోయిన్‌గా శ్రీలీలనే అనుకున్నారు. కానీ ఈ చాన్స్ కూడా ఫైనల్‌గా మీనాక్షీ చౌదరికే దక్కింది. ఓ దశలో రవితేజ మాస్ జాతర నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నారనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారట శ్రీలీల.