గేమ్‌చేంజర్ సినిమా విడుదలై, ఆరు నెలలు అవుతున్న ఈ సినిమాను గురించిన చర్చ ఇంకా అక్కడక్కడ వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా గేమ్‌చేంజర్ సినిమా గురించి, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిరీష్ రెడ్డి (Producer Shirish Reddy) చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపాయి. ‘గేమ్‌చేంజర్’ సినిమాకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లినా, ఓ మాట వరసకు కూడా ఈ చిత్రం హీరో రామ్‌చరణ్ కానీ, దర్శకుడు శంకర్ కానీ కనీసం ఫోన్ కాల్ చేయలేదని నిర్మాత శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. దీంతో రామ్‌చరణ్‌పై, ఆయన యాంటీ ఫ్యాన్స్ కొందరు చరణ్‌ను ట్రోల్ చేశారు. అలాగే నిర్మాత శిరీష్ రెడ్డిపై కూడా ట్రోలింగ్ జరిగింది.

ఈ వివాదం పెరిగి పెద్దదవుతుండటంతో, చరణ్ ఫ్యాన్స్ ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. రామ్‌చరణ్‌పై అనవసరంగా ఏమన్నా మాట్లా డితే సహించేది లేదని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. దీంతో ఎట్టకేలకు శిరీష్ (Producer Shirish Reddy) దిగొచ్చారు. రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ, ఓ లేఖను విడుదల చేశారు.

అలాగే శిరీష్ రెడ్డి సోదరుడు, గేమ్‌ఛేంజర్ ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘గేమ్‌చేంజర్’ సినిమా విడుదలై, ఆరు నెలలు అవుతున్నా, ఇంకా ఆ సినిమాపై మమ్మల్ని మీడియా వారు ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారని, ఇకనైనా ఈ విషయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ‘దిల్’ రాజు మాట్లాడారు. ఇంకా భవిష్యత్‌లో తాను రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తానని కూడ ‘దిల్’ రాజు చెబు తున్నారు. అయితే ప్రస్తుత ఘటన కారణంగా ‘దిల్’ రాజు బ్యానర్‌లో రామ్‌చరణ్ ఇప్పట్లో సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘తమ్ముడు’ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే శిరీష్ రెడ్డి, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చింది.