Star heros in e nagaraniki emaindi 2 : యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలైనప్పుడు సాధారణ ఫలితాన్నే అందుకున్నప్పటికీ, ఆ తర్వాత మీమ్ కల్చర్‌తో ‘జెన్ జెడ్’ ఆడియన్స్‌లో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. నలుగురు స్నేహితుల మందు ముచ్చట్లు, వారి సినిమా కష్టాలు ఇప్పటికీ కుర్రాళ్లకు ఫేవరెట్. అయితే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడు కొన్ని సంచలన వార్తలు బయటకు వచ్చాయి. మొదటి భాగంలో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ కష్టపడే వివేక్ (విశ్వక్ సేన్) పాత్ర, ఈ సీక్వెల్‌లో ఒక స్టార్ డైరెక్టర్‌గా కనిపించబోతున్నాడట.
ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఆయన పాత్రను తరుణ్ భాస్కర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి ఆయన చేసే హంగామా ఈసారి మరో లెవల్లో ఉండబోతోంది. విశ్వక్ సేన్ సినిమాలో డైరెక్టర్ పాత్ర పోషిస్తుండటంతో, కథను మరింత రియలిస్టిక్‌గా చూపించేందుకు తరుణ్ భాస్కర్ ఒక భారీ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్ర హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు.. ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, సుజీత్ వంటి వారు మెరుపు తీగల్లా మెరవబోతున్నారని టాక్. ఒకవేళ ఈ స్టార్లందరూ క్యామియో రోల్స్‌లో కనిపిస్తే, ఈ సీక్వెల్ హైప్ ఆకాశాన్ని తాకడం ఖాయం.
పార్ట్-1లో గోవా బీచ్‌ల్లో అల్లరి చేసిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్, పార్ట్-2లో ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేశారట. ఈసారి కథా నేపథ్యం మొత్తం థాయ్‌లాండ్ చుట్టూ తిరగనుంది. విదేశీ లొకేషన్లలో ఈ నలుగురు మిత్రులు చేసే రచ్చ, పండించే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించబోతున్నాయి. ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్, హిలేరియస్ కామెడీతో రాబోతున్న ఈ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం మీమ్ లవర్స్, సినీ ఫ్యాన్స్ ఇప్పుడే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.