సినిమా: అలప్పుల జింఖానా (Alappuzha Gymkhana Telugu review)
ప్రధాన తారాగణం: నస్లెన్, గణపతి, బేబే జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివహరిహరణ్, లుక్మాన్ అవరణ్
దర్శకత్వం: ఖలీద్ రెహమాన్
నిర్మాణం: ఖలీద్ రెహమాన్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి, జాబిన్ జార్జ్
ఎడిటింగ్: నిషాద్ యూసుఫ్
సంగీతం: విష్ణు విజయ్
కెమెరా:జిమ్సీ ఖలీద్
విడుదల తేదీ: 25–04–2025
నిడివి: 2 గంటల 20 నిమిషాలు
రేటింగ్: 2.75/5.0
కథ
కేరళలోని అలప్పులలోని ఐదురుగు ఇంటర్ విద్యార్థులు జోజో జాన్సన్ (నెస్లన్), డేవిడ్ జాన్ అలియాస్ డీజే (రెహ్మాన్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షాన వాస్ (శివ హరి హరణ్) మంచి స్నేహితులు. ఇంటర్ పరీక్ష ఫలితాలు వస్తాయి. షానవాస్ తప్ప, మిగిలిన వారందరూ ఫెయిల్ అవుతారు. చదవి పాస్ కావడం కష్టమని, స్పోర్ట్స్ కోటాలో నెక్ట్స్ స్టడీస్ చదువుకోవచ్చని జోజో జాన్సన్ తన స్నేహితులతో చెబుతాడు. అలా జాన్సన్ సలహా మేరకు అందరు అలప్పుల లోని జింఖానాబాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌కు వెళతారు. అక్కడ వీరికి కోచ్‌గా నేషనల్ బాక్సింగ్ ప్లేయర్ ఆంటోనీ జాషువా (లుక్మాన్ అవరణ్) వస్తాడు. ఆల్రెడీ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న దీపక్ (గణపతి), క్రిస్టోఫర్ (కార్తీక్), షాన్‌జాయ్(కిరణ్)లు వీరితో జాయిన్ అవుతారు. ఎలాగో అలా డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీల్లో గెలిచిన వీళ్ళు, కేరళ స్టేట్ బాక్సింగ్ చాంపియన్ పోటీలో దిగుతారు? అప్పుడు ఏం జరుగుతుంది? అలప్పుజ జింఖానా జిల్లా నుంచి ఎవరైనా ఈ పోటీల్లో గెలుస్తారా? గెలిచే మ్యాచ్‌లో దీపక్ ఎందుకు ఓడిపోతాడు? జోజో జాన్సన్ స్పోర్ట్స్ కోటా ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? అన్నది మిగిలిన కథాంశం (Alappuzha Gymkhana Telugu review).
విశ్లేషణ
చదువుల్లో ఫెయిలైన విద్యార్థులు బాధ పడకుండ, తమలో ఎలాంటి నిజమైన నైపుణ్యం ఉందో ఆ దిశగా అడుగులు వేయాలనే చిన్నపాటి సందేశానికి బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించాడు దర్శకుడు. ఇంటర్ విద్యార్థులు అంటే..ఆ వయసులో ఉన్న వారి ఆలోచనలు, ప్రవర్తన, వాస్తవ జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలను వినోదాత్మకంగా చెప్పారు. ఈ బ్యాక్సింగ్ స్పోర్ట్స్ ఫిల్మ్ గెలిచినవాళ్ల కాదు. జీవితంలో గెలవా లనుకునే వాళ్ళ కథ. మొదటి ప్రయత్నంలో ఓడిన వాళ్ల కథ (Alappuzha Gymkhana)
కథలో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేదు. కాకపోతే కథను జోజో జాన్సన్ రోల్ డ్రైవ్ చేస్తుంటుంది, పైగా స్క్రీన్ ప్రెజెన్స్, లవ్ ట్రాక్‌లు ఈ క్యారెక్టర్‌కే ఎక్కువగా ఉంటాయి కాబట్టి..ఇతన్నే హీరో అనుకోవాలి. కానీ అన్నీ కథల్లో మాదిరి హీరో గెలవడు ఇక్కడ. ఆ మాటకోస్తే ఎవరూ గెలవరు. ఎవరైనా గెలిచి, అలప్పుల జింఖానాకు కప్ వస్తే అది మలయాళం సినిమా ఎందుకు అవుతుంది.

సినిమా కాస్త స్లోగానే స్టార్ట్ అవుతుంది. కథలోని మేజర్ క్యారెక్టర్స్ అన్నీ ఒకచోటుకు రావడం, వీరందరూ కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీలకు వెళ్లడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ పోటీల్లో జరిగే నాటకీయ పరిణామాలు, చివర్లో అలప్పుజ జింఖానా టీమ్ తమ తప్పొప్పులను తెలుసుకోవడం..వంటి సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ వీలైనప్పుడు సీరియస్‌గా ఉంటూనే, ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా జోజో జాన్సన్ రోల్‌తో క్రేజీ కామెడీ ఉంటుంది. ‘అలప్పుల జింఖానా’ టీమ్ సభ్యుల మ్యాచ్‌లప్పుడు వచ్చే ఇంట్రో సీన్, చిరుత క్యారెక్టర్ మ్యాచ్ గెలవడం, జాన్సన్ రోల్ అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ, తానే జోకర్ కావడం, ఫస్టాఫ్‌లో కిస్సింగ్ సీన్..వంటివి యూత్ ఆడి యన్స్‌కు బాగా నచ్చుతాయి. షిఫాస్ అలీ మ్యాచ్ గెలవడం, దీపక్ కావాలని మ్యాచ్ ఓడిపోవడం వంటివి ఎమోషనల్‌గానూ ఉంటాయి. నటాషా (అనాఘా మాయా రవి) బాక్సింగ్ సీన్, బ్యాగ్రౌండ్‌లో వచ్చే సాంగ్, ఈ పాత్రలో ఉండే ట్విస్ట్ బాగుంటాయి.
ఇక తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా డబ్బింగ్‌ను బాగా వాడారు. అలేఖ్య చిట్టిపికిల్స్, రెబల్‌స్టార్ రేపటి కోసం, బాక్సింగ్ ఆడమంటే బతుకమ్మ ఆడుతున్నావేంట్రా, తగ్గేదేలే, పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాలి..వంటి తెలుగు పాపులర్, సోషల్‌మీడియా డైలాగ్స్‌ను బాగా యాడ్ చేశారు. ఇవన్నీ వన్‌లైనర్స్‌గా నవ్వు తెప్పించేవే.
ఎవరు ఎలా చేశారంటే..
ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు నెస్లెన్ మరోసారి తన యాక్టింగ్‌తో మెప్పించాడు. సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్‌లా కనిపించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే క్రే జీ కామెడీ, ఎమోషనల్, లవ్..అన్నీ సీన్స్ ఈ పాత్రతోనే ముడిపడి ఉంటాయి. సీరియస్ కోచ్ ఆంటోనీ జాషువాగా లుక్మాన్ అవరణ్ మెప్పించాడు.ఫ్రాంకో ఫ్రాన్సిస్ పొట్టివాడైన గట్టివాడనిపించాడు. సెకండాఫ్‌లో మంచి సీన్ ఉంటుంది. ఉన్న బాక్సింగ్ ప్లేయర్స్‌లో సీనియర్ ప్లేయర్ దీపక్‌గా గణపతినకి మంచి వెయిట్ ఉన్న రోల్ పడింది. తొలిపార్టు హీరోయిన్ పాత్ర అనుపమను నంద నిశాంత్ తీసుకుంటే, రెండోపార్టలో అమ్మా యి లేని లోటును నటాషాగా అనఖా తీసు కుంది. కథలో మంచి ఇంపార్టెన్స్ లేకపోయిన, జింఖానాకు సంబంధం లేకపోయిన…ఈ రెండు పాత్రలు కాస్త రిలీఫ్‌గా అనిపిస్తాయి.
ఖలీద్ రెహమాన్ టేకింగ్ స్టైల్, నరేటివ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఆడియన్స్‌కు హై సీన్స్‌ని కూడా బాగా డిజైన్ చేశాడు. హీరోయిజం జోలికి పోలేదు. లేనిపోని యాక్షన్ పెట్టలేదు. సందేశాన్ని కూడా హ్యూమర్‌గా చెప్పగలిగాడు. ఖలీద్ రెహమాన్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి, జాబిన్ జార్జ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిషాద్ యూసుఫ్ ఎండిటింగ్ ఒకే. విష్ణు విజయ్ ఆర్‌ఆర్ ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్. జిమ్సీ ఖలీద్ విజువల్స్ బాగున్నాయి.
బాటమ్‌లైన్ : ఓడిగెలిచినోళ్ళ కథ