Prabhas: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందనే ప్రచారం జోరందుకుంది. ‘రాజాసాబ్’ ఫలితం తర్వాత మారుతి తన రూట్ మార్చి, మళ్లీ తన సొంత గూటికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘రాజాసాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడమే కాకుండా, మేకింగ్, కథాంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ హడావిడి కంటే కూడా తమదైన శైలి కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందని మారుతి గ్రహించినట్లు సమాచారం.
అందుకే, తన పాత సక్సెస్ టెంప్లేట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ తరహాలోనే ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను మారుతి సిద్ధం చేస్తున్నారట. చరణ్ కోసం స్పెషల్ స్క్రిప్ట్
ఈ వినోదాత్మక కథను రామ్ చరణ్‌తో చేయాలని మారుతి గట్టిగా నిర్ణయించుకున్నట్లు టాక్. త్వరలోనే చరణ్‌ను కలిసి పూర్తి స్థాయి కథను వినిపించేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చరణ్ వరుసగా భారీ యాక్షన్ డ్రామాలు పెద్ది, సుకుమార్ తో RC17 సినిమాలు చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో ఒక సరదా కమర్షియల్ సినిమా చేస్తే ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. మారుతి మార్క్ కామెడీకి చరణ్ టైమింగ్ తోడైతే బాగుంటుందనేది ఒక వర్గం ఫ్యాన్స్ వాదన. అయితే, ‘రాజాసాబ్’ డిజాస్టర్ తర్వాత చరణ్ వంటి గ్లోబల్ స్టార్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
ఒకవేళ మారుతి వినిపించే కథలో బలం ఉంటే, చరణ్ ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా, విమర్శలను పక్కన పెట్టి మారుతి మళ్లీ తన ఫేవరెట్ జోనర్‌లోకి రావడం శుభపరిణామం. ఒకవేళ మెగా పవర్ స్టార్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే చరణ్ ను ఓ సరికొత్త క్యారెక్టరైజేషన్ లో ఫ్యాన్స్ చూసే ఛాన్స్ ఉంది. మరి దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.