సినిమా: తుడరుమ్ (Mohanlal Thudarum Review)
ప్రధానతారాగణం: మోహన్‌లాల్, శోభన, మణియంపిల్ల రాజు, ఫర్హాన్ ఫాజిల్, ప్రకాష్ వర్మ, థామస్ మాథ్యూ, బిను పప్పు, ఇర్షాద్ అలీ, షైజో ఆదిమాలి
దర్శకత్వం: తరుణ్‌మూర్తి (Thudarum movie director Tarunmoorthy)
నిర్మాత: ఎం. రంజిత్
కెమెరా: షాజీకుమార్
ఎడిటర్: షఫీక్ వీబీ, నిషాద్ యూసుఫ్
సంగీతం: బేక్స్ బిజోయ్
నిడివి: 2 గంటల 46 నిమిషాలు
విడుదల తేదీ: 25 ఏప్రిల్ 2025
రేటింగ్:3/5
కథ
షణ్ముఖం అలియాస్ బెంజ్ (మోహన్‌లాల్) ఓ అంబాసిడర్ కార్ డ్రైవర్. ఒకప్పుడు తమిళ సినిమాల్లో స్టంట్ కొరియోగ్రాఫర్. హిల్ స్టేషన్ ఏరియాలో భార్య లలిత (శోభన), కొడుకు పవి (మాథ్యూ షణ్ముఖం), కుమార్తె (అమృతవర్షిణి)లతో హ్యాపీగా ఓ మంచి ఫ్యామిలీమేన్‌లా లైఫ్ లీడ్ చేస్తుంటాడు బెంజ్. ఇంకా బెంజ్‌కి తన అంబాసిడర్ కారు అంటే ప్రాణంతో సమానం. ఈ కారుతో మంచి ఎమోషన్‌ను ఫీల్ అవుతుంటాడు. ఆ కారును కూడా తన ఫ్యామిలీ మెంబర్‌లా భావిస్తాడు. అయితే సడన్‌గా ఓ రోజు షణ్ముఖం కారును సీజ్ చేస్తారు కేరళ పోలీసులు. తన కారును పోలీస్ స్టేషన్ నుంచి ఎలాగైన విడిపించుకోవాలని పలు విధాలుగా ప్రయత్నిస్తుంటాడు షణ్ముఖం. మరి..అప్పుడు ఏం జరిగింది? షణ్ముఖం కారును కేరళ పోలీసులు విడిచి పెట్టారా? సీఐ జార్జ్ (ప్రకాష్ వర్మ), ఎస్‌ఐ బెన్నీ కురియన్(బిను పప్పు)లతో షణ్ముఖంకు కలిగిన ఇబ్బందులు ఏమిటి? కేరళ పోలీసులతో షణ్ముకం గొడవపెట్టుకున్న కారణంగా, అతని కుటుంబానికి ఏమైనా ఇబ్బందులు ఎదురైయ్యాయా? అన్న ఆసక్తికరమైన అంశాలు సినిమాలో చూడాలి.
Thudarum Review: విశ్లేషణ
ఫ్యామిలీమేన్‌లా మోహన్‌లాల్(mohanlal) హీరోగా యాక్ట్ చేశారంటే…తెలుగు ఆడియన్స్ అందరికీ ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలు గుర్తు వస్తాయి. దృశ్యం సినిమాకు ఏ మాత్రం తీసిపోని సినిమా ‘తుడరుమ్’. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో సినిమా కాస్త స్లోగా ప్రారంభం అవుతుంది కానీ…ఆ తర్వాత స్పీడ్ పెరుగుతుంది. అదిరిపోయే ఇంట్రవెల్ బ్యాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. సెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉన్నా, ఆడియన్స్‌కు బోర్ కొట్టని స్క్రీన్ రాశారు తరుణ్‌మూర్తి, కేఆర్ సునీల్.
కార్ నెంబర్ ప్లేట్ థియరీ, నైట్ సీన్స్, పోలీస్ స్టేషన్ యాక్షన్ సీన్, ఫారెస్ట్ సీన్, రెయిన్ సీన్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. ట్విస్ట్‌లు కూడా బాగుంటాయి. కథలోకి సీఐ వచ్చిన తర్వాత మంచి ఆసక్తికరంగా ఉంటుంది సినిమా. కాస్త దృశ్యం సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి. ఫ్యామిలీ కోసం ఎంతదూరమైన వెళ్లే వ్యక్తిగా దృశ్యం మూవీలో కనిపించారు మోహన్‌లాల్. అలా ఈ తుడరుమ్ మూవీలోనూ కొన్ని సీన్స్ ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాదు…ఈ సినిమాలో మంచి ఎమోష నల్ సీన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో వింటేజ్ మోహన్‌లాల్ కనిపిస్తాడు. కొన్ని సీన్స్‌ను ఫ్యాన్‌బాయ్‌గా మోహన్‌లాల్‌కు తరుణ్ మూర్తి డిజైన్ చేశాడా? అనిపిస్తుంది.

‘తుడరుమ్’ (Thudarum) టీజర్, ట్రైలర్ చూస్తే…‘తుడరుమ్’ సినిమా మెయిన్ పాయింట్ ఫ్యామిలీడ్రామా అనిపిస్తుంది. కానీ కానే కాదు.. అసలు సిసలైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్స్‌లో చూపించాలని, టీజర్, ట్రైలర్‌ను అలా కట్ చేసిన ట్లున్నారు ఈ చిత్రం దర్శకుడు తరుణ్ మూర్తి (director Tarunmoorthy). ‘తుడరుమ్’ సినిమా మంచి థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామా. సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. మలయాళంలో దర్శకుడిగా తరుణ్‌మూర్తికి ఇదో మూడో సినిమా. ఇతగాడి డైరెక్షన్‌లో గతంలో వచ్చిన ‘ఆపరేషన్ జావ’, ‘సౌదీ వెలక్క’ చిత్రాలు మంచి క్రైమ్ డ్రామా మూవీస్. ఈ రెండు చిత్రాలకూ మంచి పేరు వచ్చింది. ఇందుకెనెమో..తరుణ్ మూర్తి తన మూడో సినిమాను కూడా థ్రిల్లర్‌గానే తీశారు. కేఆర్ సునీల్‌తో కలిసి మంచి స్క్రీన్ ప్లే రాశారు తరుణ్‌మూర్తి. కేఆర్ సునీల్ మంచి కథ రాశారు.
ఎవరు ఎలా చేశారంటే…!
మోహన్‌లాల్ నటన గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది? ‘తుడరుమ్’ సినిమా ఆయన కెరీర్‌లో 360వ చిత్రం. ఎప్పట్లానే తన మార్క్ స్టైల్ సూపర్భ్ యాక్టింగ్‌తో ఇరగదీశాడు. యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ సీన్స్‌లో అదరగొట్టాడు. ఇక ఈసినిమా కోసం దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మోహన్‌లాల్ (Mohanlal) – శోభన (Shobana)లు కలిసి యాక్ట్ చేశారు. స్క్రీన్‌పై వీరి కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. లలితగా శోభన బాగా చేశారు. అయితే ఈ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
పవిగా థామస్ మాథ్యూ కాస్త సీరియస్ రోల్ చేశాడు. ఇక ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచిన వ్యక్తి ప్రకాష్ వర్మ. సీఐ జార్జ్‌గా ప్రకాష్ వర్మ స్క్రీన్‌పై మంచి నటన కనబరచాడు. అతని కెరీర్‌కు ఇదే తొలి సినిమా అయినా కూడా…తనకు దక్కిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌కు న్యాయం చేశాడు. ఎస్‌ఐ బెన్నీ కురియన్ రోల్ సినిమాకు కీలకంగా ఉంటుంది. మణియం పిల్ల రాజు, ఫర్హాన్ ఫాజిల్, ఇర్షాద్ అలీ, కృష్ణ ప్రభ, సంగీత్ ప్రతాప్ వారి వారి పాత్రల పరిధిమేరకు చేశారు.
ఇక టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ మూవీ. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా ఉంటుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచింది. ఆర్‌ఆర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తొలిభాగంలో ఎడిటర్స్ షఫీక్, నిషాద్ యూసుఫ్ కాస్త కట్ చేయవచ్చు.
బాటమ్‌లైన్: ఫ్యామిలీమేన్ రివెంజ్