Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక మౌళి ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న విజువల్ వండర్ ‘వారణాసి’ గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన తన పాత్ర గురించి పంచుకున్న విశేషాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
తెలుగు తెరపై తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను పండించడంలో మహేష్ బాబు – ప్రకాష్ రాజ్ జోడీకి సాటిలేదు. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ‘వారణాసి’తో మళ్ళీ రిపీట్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నారు. తన పాత్ర గురించి చెబుతూ.. “నేను ఈ సినిమాలో వారణాసికి చెందిన ఒక పరమ శివభక్తుడిగా కనిపిస్తాను. ఆధ్యాత్మికతతో కూడిన అత్యంత శక్తివంతమైన పాత్ర ఇది” అని ఆయన వెల్లడించారు. రాజమౌళి ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి తారాగణాన్ని ఎంపిక చేసుకున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మహేష్‌ను ఢీకొట్టబోతున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో సిద్ధమవుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.