Aadarsha Kutumbam House No: 47: వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమాకు ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం.47’ (Aadarsha Kutumbam House No: 47) అనే టైటిల్ ఖరారైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధా కృష్ణ (ఎస్. చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించనున్నారు. కాగా, ఈ ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం.47’ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొద లైనట్లుగా, చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేయనున్నట్లుగా కూడ మేకర్స్ వెల్లడించారు.
వెంకటేశ్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా సినిమా వస్తుండటం విశేషం. నిజానికి వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని సినిమా రెండుమూడు సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాల్సింది. కానీ అనౌన్స్‌మెంట్‌తో ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్తుంది.
ఇక తన సినిమాల టైటిల్స్‌ను ‘అ’ అక్షరంతో స్టార్ట్ చేయడం త్రివిక్రమ్ స్టైల్. ‘అ ఆ’, ‘అజ్ఞాత వాసి’, ‘అల..వైకుంఠపురములో..’ వంటి సినిమాలు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చాయి. తాజా ఆయన తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం.47’ టైటిల్ కూడ అదే అక్షరంతో స్టార్ట్ అయ్యింది.
