రజనీకాంత్ 175 మూవీ: సౌత్ సినీ ఇండస్ట్రీలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న తలైవర్, తన రాబోయే చిత్రాల కోసం సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, రజనీకాంత్ తన 173, 174, 175 సినిమాల కోసం రెడీ చేసిన లైనప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని ‘డాన్’ ఫేమ్ సిబీ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
యువ దర్శకుడైన సిబీ, రజనీకాంత్ కోసం ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కమల్ హాసన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమా 2027 పొంగల్ కి రిలీజ్ అవుతుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రజనీకాంత్ 174వ సినిమా. ఈ చిత్రానికి ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఇందులో మరో విశేషం ఉంది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటించబోతున్నారని టాక్. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ మరియు యాక్షన్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయి.
ఇక రజనీకాంత్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 175వ సినిమా బాధ్యతను స్టార్ డైరెక్టర్ అట్లీ తీసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ‘జవాన్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో హిట్ అందుకున్న అట్లీ, సూపర్ స్టార్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ఒక భారీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. రజనీకాంత్ రేంజ్‌కు తగినట్టుగా ఈ మైలురాయి చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం. స్టార్ డైరెక్టర్లతో వరుసగా రజనీకాంత్ సినిమా చేయబోతుండటం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ‘తలైవర్ మేనియా’ మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో 175వ సినిమా అంటే, అది రికార్డుల వేటలో సరికొత్త అధ్యాయం కానుంది.