Sidhu jonnalagadda as agent Rambo : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘డీజే టిల్లు’ సిరీస్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్దు, ఇప్పుడు తన రూట్ మార్చి ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రానికి ‘రాంబో’ అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్ వినడానికి మాస్ యాక్షన్ సినిమాగా అనిపించినప్పటికీ, దీని వెనుక దర్శకుడు ఒక బలమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో నవీన్ పొలిశెట్టికి ‘ఏజెంట్’ పాత్ర ఎలాగైతే ప్లస్ అయిందో, ఈ సినిమాలో సిద్దు కూడా ఒక విభిన్నమైన ఏజెంట్ అవతారంలో కనిపించనున్నారని టాక్. సాధారణంగా సిద్దు జొన్నలగడ్డ కేవలం నటుడిగానే కాకుండా, స్క్రిప్ట్ వర్క్‌లో కూడా చురుగ్గా పాల్గొంటారు. డీజే టిల్లు, ‘టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్‌లో ఆయన రచన కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు స్వరూప్ సిద్ధం చేసిన థ్రిల్లర్ కథకు తనదైన స్టైల్ కామెడీ, డైలాగ్స్‌ను అద్దుతూ, స్క్రిప్ట్‌ను మరింత షార్ప్‌గా తీర్చిదిద్దుతున్నారట.
ఈ సినిమాలో సిద్దులోని కామెడీ యాంగిల్‌తో పాటు, గతంలో ఎన్నడూ చూడని ఎమోషనల్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. దర్శకుడు స్వరూప్ గత చిత్రంలో ఇన్వెస్టిగేషన్ విధానం చాలా కొత్తగా ఉంటుంది. అదే తరహాలో ఈ సినిమాలోనూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉండబోతోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయి, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సిద్దు, ఈసారి ఈ మూవీతో పక్కా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో, ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.