Sreeleela next movie with Kollywood star hero : టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల, ప్రస్తుతం తన కెరీర్ రూట్ మారుస్తోంది. ‘ధమాకా’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత సరైన కథల ఎంపికలో తడబడింది. 2025లో ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని మిగిల్చడంతో, తన ఫోకస్‌ను కోలీవుడ్ వైపు మళ్ళించింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ సరసన శ్రీలీల నటించిన భారీ చిత్రం ‘పరాశక్తి’ గత సంక్రాంతికి విడుదలైంది.
ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయం సాధించనప్పటికీ, శ్రీలీల నటనకు మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌కు తమిళ తంబీలు ఫిదా అయ్యారు. దీంతో అక్కడ ఆమెకు క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘D55’ లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అలాగే చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సినిమాలో శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తోంది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ – అజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీలను ఫైనల్ చేశారట. తెలుగులో వరుస ఫ్లాపులతో డీలా పడిన ఈ డ్యాన్సింగ్ క్వీన్, ఇప్పుడు తమిళంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలను దక్కించుకుంటూ అక్కడ బిజీ స్టార్‌గా మారిపోతోంది. అజిత్ వంటి టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేయడం శ్రీలీల కెరీర్‌కు పెద్ద ప్లస్ కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.