సినిమా: 8 వసంతాలు (8 Vasantalu Movie Review)
ప్రధాన తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిషోర్
రచన–దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
కెమెరా: విశ్వనాథ్ రెడ్డి
ఎడిటర్: శశాంక్ మాలి
విడుదల తేదీ: 20 జూన్ 2025 (8 Vasantalu Movie Release Date)
నిడివి: 2 గంటల 20 నిమిషాలు
రేటింగ్:
8 Vasantalu Movie Review: కథ
తండ్రి చనిపోయిన బాధ నుంచి బయటకు వచ్చేందుకు శుద్ధి అయోధ్య కలం పట్టి, రచయిత్రిగా మారుతుంది. ఒకవైపు పుస్తక రచనలు చేస్తూనే, మరోవైపు కరాటే నేర్చు కోవాలనుకున్న తన అభిలాష, ట్రావెలింగ్ చేయాలన్న తన ఆకాంక్షలను కూడా నెరవేర్చుకుంటుంటుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న శుద్ధి అయోధ్య జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటాడు. వరుణ్ కేరింగ్‌ని చూసి శుద్ధి అయోధ్య కూడా అతని ప్రేమలో పడుతుంది. కానీ శుద్ధిని మోసం చేస్తాడు వరుణ్. ఈ బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చేందుకు తన జీవితంలో మళ్లీ బిజీ అవుతుంది శుద్ధి. కానీ ఆమె జీవితంలో మరో అబ్బాయి సంజయ్ (రవితేజ దుగ్గిరాల) వస్తాడు. శుద్ధి, సంజయ్‌ల స్నేహాం ప్రేమగా మారుతుంది. కానీ అంతలోనే శుద్ధి మరో అబ్బాయితో పెళ్లికి సిద్ధమైపోతుంది. శుద్ధి అసలు ఎందుకు ఇలా చేసింది. సంజయ్‌తో శుద్ధి పరిచయం ఫైనల్‌గా ఏమైంది? శుద్ధి జీవితంలోకి వరుణ్ మళ్లీ తిరిగొస్తాడా? అనేది థియేటర్స్‌లో చూడాలి.
విశ్లేషణ
ప్రేమకథలను ఆడియన్స్ ఎన్నో చూశారు. కానీ కవిత్వానికి, భావుకత, భావోద్వేగాలను మేళవించి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ ‘8 వసంతాల’ కథను రెడీ చేసినట్లు ఉన్నారు. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా కథను చెప్పాలనే ఆలోచన బాగుంది. సమస్య ఏంటంటే..ఆలోచన వేరు. దాన్ని స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేసే కసరత్తు వేరు. నటీనటుల పెర్ఫార్మెన్స్ కావొచ్చు, విజువల్స్ రూపంలో కావొచ్చు, డైలాగ్స్ రూపంలో కావొచ్చు…దర్శకుడు చెప్పాలనుకున్నది ఆడియన్స్‌కు రిచ్ అయితే ఆ సినిమా విజయం సాధించినట్లే. కానీ ఈ 8 వసంతాలు సినిమాలో ఈ రిచ్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన విజువల్స్, కవితాత్మకత ఉట్టిపడే డైలాగ్స్ అనేవి కథకు బలంగా ఉంటాయి కానీ కథను ముందుకు తీసుకువెళ్లలేవు. ఈ సినిమా ఫణీంద్ర నర్సెట్టి డైలాగ్స్ బాగున్నాయి. సంభాషణలు ఒకే. కానీ అక్కడక్కడ ప్రేమ విషయంలో క్లాస్ పీకినట్లు ఉంటుంది. ఇంకొన్ని చోట్ల సాగదీత సన్నివేశాలు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మరీ..ముఖ్యంగా సెకండాఫ్‌లో ఉంటుంది. ట్విస్ట్ ఒకే. క్లైమాక్స్ ఇంకాస్త బాగుం డాల్సింది.
ఓ అమ్మాయి జీవితంలోని ఎనిమిది సంవత్సరాలను 8 వసంతాలు సినిమాగా చూపించారు. తొలిభాగం ఒక లవ్ స్టోరీ, మలిభాగంలో మరో లవ్ స్టోరీ చూపించారు. ఈ రెండు లవ్‌స్టోరీస్ కొత్తదనం ఏమీ లేదు. ప్లెజెంట్‌గా ప్రజెంట్ చేసిన తీరు మాత్రం ఒకే. కానీ ఎదురుదెబ్బలు తగిలినప్పుడు అమ్మాయిల మానసిక సంఘర్షణ, వాళ్ల సంకల్పం..వంటి అంశాలను మంచిగా తెరపై చూపించడం బాగుంది. కథలోని ఎమోషన్‌ను, కవిత్వం డామినేట్ చేసినట్లుగా ఉంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
శుద్ధి అయోధ్యగా అనంతిక సనిల్‌కుమార్ కష్టం, ఈ పాత్ర పట్ల ఆమెకు ఉన్న ఇష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. శుద్ధిగా అనంతిక తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. భావోద్వేగాల విషయంలోనూ మెప్పించారు. నటిగా ఆమె కెరీర్‌లో మరో ముందడుగు పడిందనుకోవచ్చు. అలాగే వరుణ్‌గా చేసిన హనురెడ్డి, సంజయ్‌గా కనిపించిన రవితేజ దుగ్గిరాల నటన కూడా బాగుంది. ఇక అనంతిక మిత్రులుగా కన్నా, సంజనలు పర్వాలేదు. ఇక మైత్రీవంటి నిర్మాణసంస్థ ఉంటే నిర్మాణ విలువలకు డోకా ఉంటుందా? ఏమీ లేదు. నిర్మాణ విలువలు, విజువల్స్ బాగున్నాయి. విజువల్స్, హేషమ్ సంగీతం ఈ సినిమాకు బలంగా నిలిచాయి. ఇంకాస్త క్రిస్పీగా ఎడిట్ చేసి ఉండొచ్చని ఆడియన్స్‌కు అనిపించవచ్చు. డైలాగ్స్, కవిత్వం, భాషలపై పెట్టిన శ్రద్ధ, కథ-కథనం, నాటకీయతలపై పెడితే అవుట్‌పుట్ మరింతగా బాగుటుంది. ప్రేమకథలను ఇష్టపడేవారిని 8 వసంతాలు సినిమా నిరుత్సాహపరచదు. అలాఅని అద్భుతమని కూడా అనిపించదు.