మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి మాస్ పవర్‌ను మరోసారి నిరూపించింది. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, ఎనర్జీ ప్రేక్షకులకు విందు భోజనంలా అనిపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రెజెంట్ సక్సెస్ ఊపులో ఉన్న చిరంజీవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబితో Mega158 ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ‘మన శంకర వరప్రసాద్’ ప్రమోషన్ల తర్వాత రెండు వారాల విశ్రాంతి తీసుకోనున్న చిరంజీవి, ఫిబ్రవరి నుండి ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా కథ పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. చిరంజీవి ఇందులో ఒక పవర్ ఫుల్ బెంగాల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారట.
ఆయన లుక్, మేకోవర్ అత్యంత కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి-బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే కథకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, బాబీ టీమ్ షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను వచ్చే ఏడాది (2027) ప్రథమార్థంలో విడుదల చేసే అవకాశం ఉంది. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుండటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.